25, జూన్ 2010, శుక్రవారం

పొలం అమ్మడం బాధగా ఉంటుంది

ఎంతోమురిపెంతో ఆప్యాయంగా పెంచుకున్న
పచ్చటిపైట చుట్టుకున్న పైరుతల్లులు
వడివడిగా సుడులు తిరిగే పంట కాలువలు
పంటలపై వల విసిరేసినట్టు గబుక్కున వాలే
పక్షుల గుంపుల నొదిలి
పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

తెలతెలవారక ముందే పొలందారి వెంట
గడ్డి పూలపై మంచు బిందువుల మాటలతో
అక్కా బావా అన్నా వదినా అంటూ పిలిచే వలపుల పిలుపులు
పక్క పక్క చేలల్లో నుండి జాలువారే
బావా మరదళ్ళ నవరసాల వరసల సరసాలు
ఆకుపచ్చదారంతా వచ్చే పోయే వాళ్ళ ఆప్యాయతా పిలుపులనొదిలి
పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

వర్షానికి తడిసి ఆవిరై ఎగసిపడే
కమ్మటి నేలతల్లి సువాసనల నొదిలి
మేలిమి విత్తనాలనుండి
కువకువల్తో తొంగిచూసే కోడిపిల్లల్లాంటి
లేలేత మొక్కల్నొదిలి
పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

పండిన చేలు తలలూపుతూ పాడే పాటలు
గాలి నలువైపులా మోసుకుపోయే కొత్త ధాన్యపు ఘుమఘుమలు
బండినిండా బస్తాలు నింపుకొని చెర్నాకోలతో
ఎద్దుల్ని ఆప్యాయంగా అదిలించే అదిలింపుల నొదిలి
పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

కల్తీ పురుగు మందులు నకిలీ విత్తనాలు
సకాలంలోపడని వర్షాలకు
ఎన్నిసార్లు నష్టాల ఊబిలో కూరుకు పోతున్నా
గోడక్కొట్టిన బంతిలా
మళ్ళీ మళ్ళీ దుక్కి దున్ని విత్తులు చల్లినా
ఆశలు మోసులెత్తక
రాశులు రాశులుగా పెరిగిపోతున్న
అప్పులు తీర్చేందుకు
పొలం అమ్మడం బాధగా ఉంటుంది

22, మే 2010, శనివారం

వెన్నెలా ఆమే మేమూ !


ఆ పిండార బోసిన వెన్నెల కురిసే రాత్రిలో
పులులు కూడా తిరిగే దుర్గమారణ్యంలో
చాలా ధైర్యంగానూ అంతకు మించిన ధీమాతోనూ
నడుస్తూ నడుస్తూ
పచ్చి పచ్చిగా తడితడిగా ఉండేగుండె లోతుల్లోనుండి
ఆమె పుచ్చపువ్వులా నవ్వుతూ నవ్వుతూ
నయాగరా జలపాతాల్ని కన్నుల ముందుకు తెచ్చింది
కులూ మనాలిలో కలవరించిన సంగతులూ
హిమాలయాల్లో మనుషులూ మంచులా కరిగిపోయిన వైనాలూ చెప్పింది
అగాధాల లోతుల్లోకెళ్ళి సంతోష సాగరంలో
ఎలా మునిగి తేలాలో చేసి చూయించింది
మనుషులు జంతువులుగా మారిన రాజ్యంలో
సజీవంగా ఎలా కదలాలో ఆరాత్రే మాముందు ద్రుశ్యీకరించింది
కాలంతో కలిసిపోయి కదిలిపోవడమెలాగో నేర్పించింది
పూలలా సువాసనల్తో రాలిపోవడమెలాగో
గోరింకల్తోసావాసాలూ కోయిలల్తో గానాలూ
నెమలుల్తో నాట్యాలూ చెట్లతోమాటలూ పాటలూ
ప్ర త్యక్షముగా చేసి చూయించింది
ఆ నవ్వులలా పువ్వుల్లా రాలుస్తూనే
లేగల్ని తోడేళ్ళు జింకల్ని పులులూ
ఏనుగుల్ని సింహాలూ తినడమెలాగో చెబుతూ చెబుతూ
మనుషుల్ని మనుషులే పీక్క్కుతినే స్మశాన సంగీతం కూడా
అలవోకగా వినిపించింది
అలా అలా అలల్లా
వెన్నెల కళ్ళల్లో మిలమిల మెరిసే నక్షత్రాలను పూయిస్తూనే ..........
స్నేహాలను కూడా డబ్బు తిమింగళం మింగేయడం
కళ్ళకు కట్టి ప్రయోగంలా మరీ చూయించింది